TG: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నిర్మల్ జిల్లా:
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బైంసా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిశీలించి,పరిష్కరించాలని అధికారులను సూచించారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్వే నిర్వహించి వివరాలను రికార్డు రూపంలో సమర్పించాలన్నారు.
వరి ధాన్యం, పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సేకరించిన వరి ధాన్యం, పత్తి పంట, రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పంటలను అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సన్న వడ్ల పై క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల లోనే పంటను అమ్ముకోవాలని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇండ్లు, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.
Nov 16 2024, 20:07