విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అంత సులువు కాదు!
గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఉన్నత విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నత విద్యకు నిలయాలైన యూనివర్సిటీలన్నీ సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇవి అధికార పార్టీకి అనుబంధ సంస్థలుగా మారిపోయాయి. కాబట్టే ప్రభుత్వం మారగానే దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం వీసీల నియామకంలో ఎలా వ్యవహరించిందో
అర్థమవుతుంది. ఉపకులపతి పోస్టులకు సంబంధించి అప్పటికే ఉన్న నిబంధనలను సడలించి, తమ వారికి వైసీపీ పట్టం కట్టింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వీసీగా పని చేసిన వ్యక్తికి ప్రొఫెసర్‌గా పదేళ్ల సర్వీసు లేకపోవడంతో అప్పటికే నియమించిన సెర్చి కమిటీని రద్దు చేసి, ఆయన కోసమే ఆ నిబంధన మార్చి, మరోసారి సెర్చ్ కమిటీ వేసి ఆ వ్యక్తినే వీసీగా నియమించారు. ఈ వ్యవహారంలో కీలక మంత్రి ఒకరు చక్రం తిప్పారన్నది బహిరంగ రహస్యం. ఆయన అనంతరం ఆ పదవిలోకి వచ్చిన వ్యక్తి కూడా మాజీ మంత్రి చెబితే తప్ప, ఆ పదవి నుంచి వైదొలగనన్నారు. అయితే యూనివర్సిటీలో ఆయన వల్ల నష్టపోయిన బాధితులంతా ఏకమవడంతో ఇక్కట్లు తప్పవని గ్రహించి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) వీసీగా పని చేసిన ప్రసాద రెడ్డి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీసీగా ఆయన పదవీ కాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్ వీసీగా అప్పటికే రెక్టారుగా పని చేస్తున్న మహిళను నియమిస్తే, ప్రసాద రెడ్డి సహించలేకపోయారు. రెండు రోజుల పాటు వీసీ ఛాంబర్‌లో ఆమెను కూర్చోనివ్వలేదు. దీంతో ఆమె రెక్టార్ ఛాంబరులోనే వీసీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీల వ్యవహారం ఇదే తరహాలో నడిచింది. ఇక వర్సిటీల పాలకమండళ్లయితే గత ప్రభుత్వంలో పూర్తిగా అధికార పార్టీకి చెందిన రాజకీయ నిరుద్యోగులతోనే నిండిపోయాయి.
యూనివర్సిటీలు రాజకీయ కేంద్రాలుగా మారడంతో బోధనారంగం తీవ్రంగా నష్టపోయింది. ఏ ఒక్క వర్సిటీలోనూ తగినంత మంది శాశ్వత ఆచార్యులు లేరు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం అధ్యాపక విద్యార్థుల నిష్పత్తి 1:20గా ఉండాలి. ఏ ఒక్క యూనివర్సిటీలోనూ ఈ నిష్పత్తి లేదు. విద్యార్థులకు సరైన విద్య అందక వర్సిటీలంటే పీజీ పట్టాలిచ్చే కేంద్రాలుగా మిగిలిపోతున్నాయి. అధ్యాపకుల కొరత పరిశోధనా రంగంపై మరింత తీవ్రంగా పడుతున్నది. బోధన కోసం తాత్కాలిక పద్ధతుల్లో కాంట్రాక్టు అధ్యాపకులను నియమించుకుని నెట్టుకు వచ్చినా, పరిశోధనా రంగం విషయంలో అటువంటి అవకాశం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లుగా శాశ్వత ఉద్యోగులకు మాత్రమే పరిశోధనలు (పీహెచ్‌డీ) చేయించే అవకాశం ఉంది. దీంతో పరిశోధకులకు మార్గనిర్దేశం చేయాల్సిన అధ్యాపకుల కొరత తీవ్రమై ఈ ప్రభావం ఆ రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. రాష్ట్రంలోని ఒక ప్రఖ్యాత వర్సిటీలోని తెలుగు అధ్యయనశాఖలో 16 మంది శాశ్వత అధ్యాపకులు ఉండాల్సిన చోట ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. పరిశోధనలన్నీ ఆ ఒక్కరి వద్ద జరగడం అసాధ్యం. దాదాపు అన్ని వర్సిటీల్లో ఇదే స్థితి. ఈ తరహా విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే ఏటా నిర్వహించాల్సిన రీసెట్‌లు సక్రమంగా జరగడం లేదు. ఏటా రెండుసార్లు యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) సాధించి, ఆర్థిక భరోసాతో పరిశోధనలు చేయడానికి వస్తున్న పీహెచ్‌డీ ఆశావహులకు ఏపీలోని యూనివర్సిటీల్లో దాదాపు అన్ని విభాగాల్లోనూ రెడ్ బోర్డులే ఎదురవుతున్నాయి.
దీంతో పాటు శాశ్వత అధ్యాపకులకు మాత్రమే యూజీసీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్ వంటి అనేక సంస్థలు నుంచి అందివచ్చే రీసెర్చి ప్రాజెక్టులు అందడం లేదు. వివిధ సంస్థలు ఇచ్చే పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్‌లపైనా ఈ ప్రభావం ఉంటున్నది. సైన్సు విభాగాలైతే కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కోల్పోతున్నాయి. అవసరమైన స్థాయిలో నియామకాలు లేకనే పరిశోధనా రంగానికి ఈ స్థాయి నష్టం జరుగుతోంది.
వర్సిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. గతంలో ఏ వర్సిటీకి ఆ వర్సిటీ తమ వద్ద ఉన్న ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసుకొనేవి. అయితే వివిధ కారణాలతో పోస్టుల క్రమబద్ధీకరణ చేయాలని గత ప్రభుత్వాలు భావించడంతో కొత్త సమస్యలు తలెత్తాయి. 2018లో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు పూర్తయ్యాయి. తరువాత లోపాల కారణంగా ఆ నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
వన్నీ పట్టించుకోని జగన్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి రేషనలైజేషన్ పేరుతో ఇష్టానుసారం వ్యవహరించింది. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా నిర్ణయాలు జరిగాయి. ఉదాహరణకు ఎస్‌వీయూలోని ఆంత్రోపాలజీ విభాగాన్ని మరో విభాగంలో అంతర్భాగం చేసి అక్కడ ఉన్న ఆచార్య పోస్టులను తగ్గించారు. ఏయూలో అదే ఆంత్రోపాలజీని అలాగే కొనసాగించారు. ఇష్టానుసారం విభాగాలను కుదించడం, కలిపివేయడం, ఒక డిపార్టుమెంటులోని పోస్టులను మరోచోట చూపించడం వంటివి సాధారణమయ్యాయి. ఇటువంటి వింతలతో ఆ రేషనలైజేషన్ లోపభూయిష్టంగా ఉండడంతో, దీనిపై ఆయా వర్శిటీల్లో పెద్ద చర్చే నడిచింది. మూడు వేలకు పైగా పోస్టులను తామే భర్తీ చేస్తామంటూ గత ప్రభుత్వం ఎన్నికల సమయానికి నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల రోస్టరు పాయింట్లకు సంబంధించి అనేక లొసుగులు వెలుగు చూశాయి. మహిళా రిజర్వేషన్ కింద వారికి ఏ నెంబరు పోస్టో స్పష్టం చేయలేదు. దివ్యాంగుల రోస్టరు పాయింట్లను పూర్తిగా విస్మరించి, మోసగించి 42 వేల మంది అభ్యర్థుల నుంచి ఫీజుల రూపంలో కోట్లాది రూపాయల్ని దండుకొని వారి ఆశలతో ఆటలాడుకుంది. అనంతరం కోర్టుల్లో ఎదురైన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పుకోలేని స్థితిని జగన్ ప్రభుత్వం ఎదుర్కొంది
వర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయడం కూటమి ప్రభుత్వానికి అంత సులభం కాదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌లో రోస్టర్ పాయింట్లకు యూనివర్సిటీని యూనిట్‌గా తీసుకోవాలా లేదా డిపార్ట్‌మెంట్‌ను యూనిట్‌గా తీసుకోవాలా అనే అంశం, జగన్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని లోపాలు, కాపులకు గతంలో ఇచ్చిన ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు (దీన్ని జగన్ ప్రభుత్వం తొలగించింది), మహిళా, దివ్యాంగుల రోస్టరు పాయింట్లు అనేవి మరోసారి సమస్యగా మారవచ్చు. ఇప్పటికే వర్సిటీలకు సంబంధించి వందలాది కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి.
దాదాపు రెండు దశాబ్దాలుగా శాశ్వత నియామకాలు లేకపోవడంతో బోధన కోసం అన్ని వర్సిటీల్లో కాంట్ట్రాక్టు, టీచింగ్ అసిసెంట్లు, అతిథి అధ్యాపకుల రూపంలో వేలాదిగా పనిచేస్తున్నారు. వారికి అందుతున్నవి అరకొర వేతనాలే. అవి కూడా ఒక్కో వర్సిటీలో ఒక్కో వేతనం ఉంది. ఎంతో కాలంగా యూనివర్సిటీలనే నమ్ముకుని బతుకీడుస్తున్న వారికి శాశ్వత అధ్యాపక పోస్టుల నియామకాలలో న్యాయం చేయాల్సి ఉంటుంది.
ఈ చిక్కుముడులన్నీ విప్పడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. గాడితప్పిన పాలనా వ్యవస్థను చక్కదిద్దడంతో పాటు ఆచార్య పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తే తప్ప రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు మనుగడ ఉండదు.
Jul 23 2024, 19:23