కేంద్రసాయమే ఆంధ్రప్రదేశ్‌కి ఆక్సిజన్!
ఆర్థిక సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించడం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ నూతన ప్రభుత్వాలకు పెను సవాలే. విభజన నష్టం నుంచి కోలుకోకుండానే జగన్‌రెడ్డి ఆర్థిక అరాచకత్వం ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి...
ఆర్థిక సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించడం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ నూతన ప్రభుత్వాలకు పెను సవాలే. విభజన నష్టం నుంచి కోలుకోకుండానే జగన్‌రెడ్డి ఆర్థిక అరాచకత్వం ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. రూ.13లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రం దిగజారింది. ప్రతి ఏటా రూ.40వేల కోట్లకు పైగా అసలు, వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సిన దుస్థితి. ఇప్పుడీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వ దీక్షాదక్షతలతో పాటు, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు అవశ్యం. బిహార్ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకహోదా తీర్మానం నేపథ్యంలో మళ్లీ ప్రత్యేక హోదా ప్రతిపత్తి చర్చనీయాంశమైంది. దేశంలోని 29 రాష్ట్రాలలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఉంది
మరో 5 రాష్ట్రాలలో (బిహార్, ఏపీ, రాజస్థాన్, గోవా, ఒడిశా) ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా 5 ఏళ్లపాటు ఇస్తామన్నది 20 సెప్టెంబర్, 2013న రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన 6 హామీల్లో ఒకటి. ప్రస్తుతం ఆ హోదా ఉన్న రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్ఎస్)కే ఇది పరిమితమైంది, ఆయా రాష్ట్రాలకు 90శాతం గ్రాంట్లుగా, 10శాతం రుణంగా కేంద్రం నుంచి అందుతాయి. కొత్త పరిశ్రమలను నెలకొల్పే కంపెనీలకు ఆదాయపన్ను మినహాయింపులు, ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు లభిస్తాయి.
ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర పునర్విభజన కారణంగా అత్యధిక రాబడినిచ్చే హైదరాబాద్, రంగారెడ్డి రెండు జిల్లాలు తెలంగాణకు పోయిన దరిమిలా ఏపీ కుదేలైంది. రూ.12వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా, రూ.60వేల కోట్ల ఖర్చులు, వారసత్వ రుణంగా రూ.90వేల కోట్లు సంక్రమించాయి. దీన్ని అధిగమించడానికే ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా హామీ. కానీ వైవి రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం దరిమిలా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొంటూ, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు
స్పెషల్ కేటగిరీ స్టేటస్‌తో వచ్చే లబ్ధిని స్పెషల్ అసిస్టెన్స్ రూపంలో అందిస్తామని చెప్పడం విదితమే. అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై ఆసక్తి కన్నా సీబీఐ, ఈడీ కేసుల నుంచి బైటపడటంపైనే పూర్తి దృష్టి కేటాయించిన కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా నష్టపోయింది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్రాలకు అదనపు నిధులు ఇచ్చినా అక్కడితో సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది సందేహాస్పదమే. బడ్జెట్ కేటాయింపుల సమర్ధ వినియోగం ఇక్కడ కీలకమైంది. ఉత్పాదక వ్యయం పెరగాలి, అనుత్పాదక వ్యయం తగ్గాలి, దుబారా వ్యయాన్ని అరికట్టాలి,
శాసనసభ ఆమోదం లేకుండా నిధుల వ్యయానికి అడ్డుకట్ట వేయాలి. కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టడం ఒక ఎత్తయితే, రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులను సమర్థంగా వెచ్చించడం మరో ఎత్తు. ఏపీలో గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల వ్యయంలో ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఇచ్చే నిధులను భారీఎత్తున దారి మళ్లించింది. ఫలితంగా తర్వాత సంవత్సరాల్లో ఆయా పథకాలకు నిధుల్లో కోత పడిందంటే రాష్ట్ర పాలకుల వైఫల్యమే.
2023 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపుల్లో రూ.92,567కోట్లు ఖర్చు చేయలేకపోయారు. వైద్య, ఆరోగ్య రంగంలోనే రూ.6,576కోట్లు, పట్టణాభివృద్ధి రంగాల్లో రూ.4,655కోట్లు, సాంఘిక సంక్షేమంలో రూ.5,254కోట్లు, వెనుకబడిన వర్గాల సంక్షేమంలో రూ.16,360కోట్లు, నీటిపారుదల శాఖలో రూ.9,034కోట్లు ఖర్చు చేయలేదు. ఈ నిధులన్నీ సమర్థంగా వినియోగిస్తే అసలు ప్రత్యేక హోదా ప్రతిపత్తి అవసరమే లేదని కాగ్ మాజీ డీజీ గోవింద భట్టాఛార్జీ పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో ఈ దుస్థితిని చక్కదిద్దకుండా ఒకవేళ అదనపు నిధులిచ్చినా అవీ నిరర్ధకమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు గమనార్హం.
అవీ నిరర్ధకమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు గమనార్హం. ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్మోహన్‌రెడ్డి దాని కోసం కనీస ప్రయత్నం చేయలేదు. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి ఆర్థికసాయం రాబట్టేందుకూ కృషి చేయలేదు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములలో రాష్ట్ర వాటా తెచ్చుకోవడంలో గాని, డివల్యూషన్ పన్నులు 42శాతం నుంచి 41శాతంకు తగ్గినా అడిగిన పాపాన పోలేదు.. సెంట్రల్ పూల్ ఫండ్స్‌లో ఒక శాతం కోతపడ్డా చీమ కుట్టినట్లు లేదు. రెండంకెల వృద్ధిరేటు సింగిల్ డిజిట్‌కు పడిపోవడమే కాదు, తిరోగమన వృద్ధి నమోదైంది. తలసరి ఆదాయం పూర్తిగా క్షీణించింది, అనుత్పాదక వ్యయం పెరిగింది. జగన్ నిర్వాకాల కారణంగా ఏపీ రూ.13లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.
కేంద్ర పథకాల నిధులను నిర్దేశిత లక్ష్యాల కోసం కాకుండా పెద్దఎత్తున దారి మళ్లించారు. పట్టణాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు రూ.13,788కోట్లు ఖర్చు చేయలేకపోయారు. తాగునీటి ప్రాజెక్టులకు ఏఐఐబీ ఇచ్చిన రూ.5,350కోట్లలో గత ఐదేళ్లలో రూ.430కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అమృత్ 2వ దశలో రూ.8,078కోట్లకు రూ.360కోట్లే ఖర్చు చేశారు, తొలి దశలోనూ రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేయలేదు. ఎన్‌హెచ్‌ఎం నిధులు రూ.500కోట్లు పక్కదారి పట్టించడం వల్ల తర్వాత ఏళ్లలో రూ.1500కోట్ల నిధులను రాష్ట్రం కోల్పోయింది. నరేగా, నాబార్డు, సిఎస్‌ఎస్, ప్రపంచబ్యాంకు నిధులను దారి మళ్లించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనుల్లో రూ.628కోట్లు ఆదా చేశానని చెప్పి రూ.68వేల కోట్ల నష్టం చేశారు.
జలవనరుల శాఖలో పెండింగ్ బిల్లులే రూ.26వేల కోట్లు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకే రూ.11వేల కోట్లు, ఇతర బిల్లులు రూ.15వేల కోట్లు. రైతులకు ధాన్యం బకాయిలు రూ.1659 కోట్లు పేరబెట్టారు. ఐదేళ్లలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌ను రూ.36,300 కోట్ల అప్పుల్లో ముంచేశారు. రాజధాని అమరావతిలో పనులన్నీ ఆపేసి విధ్వంసం సృష్టించారు. రాజధానిలో మౌలిక వసతులకు రూ.50వేల కోట్లు ఖర్చుచేస్తే, పన్నుల రూపంలో రూ.20–30వేల కోట్ల ఆదాయం వచ్చేది. ప్రభుత్వం వద్ద మిగిలే 8వేల ఎకరాలకు అప్పట్లోనే రూ.80వేల కోట్ల విలువ ఉంది, అభివృద్ధి చేస్తే ఇప్పటికే రూ.1,60,000కోట్ల సంపద ఉండేది. అమరావతిలో గత ప్రభుత్వం స్థలాలిచ్చిన 132 సంస్థలను తేవడంలో విఫలమయ్యారు. రూ.57కోట్లు లాభం వచ్చే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును రూ.164కోట్ల నష్టంలోకి నెట్టారు. వీటన్నింటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్‌లో పెట్టాల్సిన కర్తవ్యం నూతన ప్రభుత్వంపై ఉంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తన తొలి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీకి ఇచ్చిన వినతిలో 7 ముఖ్యాంశాలపై కేంద్రం సహాయ సహకారాలు అందించాలి. స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికచేయూతనివ్వడం, పోలవరం ప్రాజెక్టు పనుల పునఃప్రారంభానికి సత్వర చర్యలు, రాజధాని అమరావతిలో మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల పూర్తికి సాయం చేయాలి. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు, రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకాల కింద అదనపు కేటాయింపులిచ్చి రోడ్లు, వంతెనలు, తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు, దుగరాజపట్నం పోర్టు పూర్తికి చేయూతనివ్వాలి.
విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక తోడ్పాటునివ్వాలి... అది ప్రత్యేక హోదా రూపంలోనా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ రూపంలోనా పేరేదైనా సత్వర సాయం–సమర్థ వినియోగం అవశ్యం.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించాలంటే దిగువ పేర్కొన్న 15సూత్రాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని నూతన సీఎం చంద్రబాబుకు లేఖలో విజ్ఞప్తి చేశాం. పన్ను రాబడులను క్రమబద్ధీకరించాలి. డివల్యూషన్ కింద కేంద్రం నుంచి వచ్చే పన్ను రాబడి 41శాతం లేదా 42శాతం ఉండేలా చూడాలి. తెచ్చే రుణాల్లో సహేతుకత, స్థిరత్వం ఉండాలి. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు మరిన్ని సాధించాలి. వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ కింద తెచ్చేవి జాగ్రత్తగా వాడాలి. రెవిన్యూ ఖర్చులు సాధ్యమైనంత తగ్గించాలి
అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరాలి. మూలధన వ్యయంలో కోతల్లేకుండా చూడాలి. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని చేయాలి, ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చాలి. ప్రభుత్వానికి రాబడి పెంచే సహజవనరులను పరిరక్షించాలి. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కొల్లగొట్టిన సంపదను రెవిన్యూ రికవరీ యాక్ట్ కింద రాబట్టాలి. ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థికలోటు, ద్రవ్యలోటు, రెవిన్యూలోటు నియంత్రించాలి. సీఎఫ్‌ఎంఎస్ ద్వారానే అన్ని చెల్లింపులు జరిగేలా చూడాలి. అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలి.
Jul 11 2024, 08:41