TS: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్
HYD: సంక్షేమ పథకాలలో భాగంగా సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త తెలిపారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు "ముఖ్యమంత్రి అల్పాహార పథకం" అందించాలని సీఎం నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధన తో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది.
ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీ పనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.
కాగా, తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సీఎం ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న "విద్యార్థులకు అల్పాహారం" పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది.
Sep 16 2023, 14:56