ఐరాసలో యోగా.. వైట్ హౌస్ ఆతిథ్యం: మోదీ అమెరికా షెడ్యూల్ లో ఖరారు
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 20 నుంచి 25 వరకు ఆయన అమెరికా (USA), ఈజిప్టు దేశాల్లో పర్యటించనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. జూన్ 21న న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Day of Yoga) ఏటా నిర్వహించుకోవాలని 9 ఏళ్ల క్రితం ఇదే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ తొలిసారి ప్రతిపాదించారు. ఆ తర్వాత ఐరాస ప్రధాన కార్యాలయం లో యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనడం ఇదే తొలిసారి. జూన్ 21న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ యోగా సెషన్ జరగనుంది. ఇందులో ఐరాస ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొననున్నారు.
₹మోదీకి బైడెన్ ఆతిథ్యం.._
ఇక, అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 22న ప్రధాని మోదీ వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశం కానున్నారు. అదే రోజు సాయంత్రం అధ్యక్షుడు బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్.. మోదీ కి అధికారిక విందు ఇవ్వనున్నారు. దీనికంటే ముందు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.
జూన్ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలిసి ప్రధానికి ఆతిథ్యమివ్వనున్నారు. వాషింగ్టన్లో ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కంపెనీల సీఈవోలు, పలు రంగాల నిపుణులతో ఆయన చర్చలు జరపనున్నారు. ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు. అమెరికా పర్యటన నుంచి ప్రధాని నేరుగా ఈజిప్టు వెళ్లనున్నారు. జూన్ 24, 25 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశానికి వెళ్లనుండటం ఇదే తొలిసారి.
Jun 16 2023, 13:52