అమరావతిలో మరో కార్యక్రమానికి శ్రీకారం జనవరి నుంచి పనులు ప్రారంభం
రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కార్ తిరిగి జీవం పోస్తుంది. వైఎస్సార్సీపీ సర్కార్ కక్షపూరిత ధోరణితో పునాదుల దశలోనే నిలిచిపోయిన ఐకానిక్ భవనాల పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్ ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ అలైన్‌మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
రాజధాని అమరావతి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏ భవనం పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి సారించింది. గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగమైన జీఏడీ టవర్స్, హెచ్ఓడీ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల ర్యాప్ట్ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి. అయితే గత ఐదేళ్లుగా వీటిని జగన్ సర్కార్ గాలికొదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకాన్ని తలపిస్తోంది.
దీంతో వీటి పటిష్ఠతపై ఇప్పటికే మద్రాస్, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్‌కి ఎటువంటి ఢోకా లేదని తేల్చింది. దీంతో ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. రెండు ట్రాక్టర్‌లకు భారీ మోటార్లు బిగించి పైప్‌లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణా నదిలోకి పంపిస్తున్నారు.
జీఏడీ టవర్స్ బేస్‌మెంట్, గ్రౌండ్‌తో పాటు 47 అంతస్థులు, టెర్రస్, హెలీప్యాడ్‌తో సహా నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఓడీ టవర్స్ బేస్‌మెంట్, గ్రౌండ్, 39 అంతస్థులు, టెర్రస్‌లతో నిర్మించనున్నారు. అసెంబ్లీ భవనం 250 మీటర్ల టవర్ ఎత్తుతో 103 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు. హైకోర్టు నిర్మాణంలో బేస్‌మెంట్, గ్రౌండ్, 7 అంతస్థులతో 55 మీటర్లు ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు. ఇప్పటికే వీటన్నింటికీ ర్యాప్ట్ ఫౌండేషన్ పూర్తికాగా, జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుని ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్ బీ, సీఆర్డీఏ అధికారులతో సమీక్షించిన సీఎం పలు మార్పులు సూచించారు. ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌కి సీఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసింది. ఆర్ అండ్ బీ శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేస్తే, ఆ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.అలైన్‌మెంట్ ఖరారైతే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నాయి. మరోవైపు ఓఆర్ఆర్ నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఓఆర్ఆర్ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీనిని ఏడు జాతీయ రహదారులతో అనుసంధానించనున్నారు. అనంతపురం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారిని ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు.
Dec 26 2024, 10:48