ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు...సాయంత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధానితో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.
రాజధాని అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారు. దీనిని వేగవంతం చేయాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందించడంతోపాటు వరద సెస్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చేపట్టే నూతన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. దాదాపు గంటకు పైగా ప్రధానితో చంద్రబాబు భేటీ అయ్యారు. మరోవైపు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో బుధవారం ఉదయం ఎన్డీయే నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్‌లో చేలరేగిన దుమారం, పలు రాజకీయ అంశాలపై ఎన్డీయే నేతలు ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. వాజ్‌పేయ్ శత జయంతి వేళ సుపరిపాలన అంశాలపై సమాలోచనలు జరిపారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును జేపీసీకి పంపించడంతో..ఆ అంశంపై చర్చించినట్టు తెలిసింది. మిత్రపక్షాల మధ్య సమన్వయం, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించారు.
ఎన్డీయే సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన సీఎం చంద్రబాబు... రైల్వే జోన్ సహా, వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Dec 26 2024, 10:18