శ్రీతేజ్ కోసం వేణు స్వామి సంచలన నిర్ణయం
అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.
శ్రీతేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. కొద్దిసేపటి కిందటే ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ బాలుడి తండ్రి భాస్కర్‌తో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. శ్రీతేజ్‌కు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లు, అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వేణు స్వామి విలేకరులతో మాట్లాడారు. ఆ బాలుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్‌ను భాస్కర్‌కు ఇచ్చారు. భాస్కర్ కుమార్తె కోసం ఈ మొత్తాన్ని ఇచ్చానని వివరించారు. 1,000 సినిమాల వరకు తాను ముహూర్తాలను పెట్టానని, సినిమా సొమ్మును తిన్నానని, అందుకే ఆ మొత్తంలో కొంత భాస్కర్‌కు ఇచ్చానని పేర్కొన్నారు.
శ్రీతేజ్ ఆరోగ్యం గురించి విలేకరులు ప్రశ్నించగా.. 90 శాతం వరకు మెరుగుపడిందని అన్నారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే చికిత్స తీసుకుంటోన్నాడని చెప్పారు. శ్రీతేజ్ మృత్యువు బారిన పడకుండా తనవంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు వేణు స్వామి తెలిపారు. అపమృత్యు దోషం తొలగిపోవడం కోసం మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని చెప్పారు.
శ్రీతేజ్ కోసం ఏం చెస్తే బాగుంటుందని తాను కొంతమందితో మాట్లాడానని మృత్యుంజయ హోమం చేయాలని కొందరు సలహా ఇస్తోన్నారని అన్నారు. తన సొంత ఖర్చుతో మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని, ఈ విషయాన్ని శ్రీతేజ్ తండ్రికి కూడా తెలియజేశానని వేణు స్వామి చెప్పారు.
Dec 25 2024, 20:00