NLG: నల్లగొండకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
నల్లగొండ: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ఈనెల 7 వ తేదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్ల విషయమై జిల్లా అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తాత్కాలిక సమాచారం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి 7 వ తేదీన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, నల్గొండ మెడికల్ కళాశాల ప్రారంభం, స్కిల్ సెంటర్ తదితర వాటిని ప్రారంభించి.. అనంతరం నల్గొండ లోని నాగార్జున కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఇందుకుగాను ఆయా కార్యక్రమాల వద్ద ఇన్చార్జి అధికారులు ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా బహిరంగ సభ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె ఆదేశించారు.
ఈ విషయమై ఆమె నీటిపారుదల శాఖ, వైటీపీఎస్, మున్సిపల్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తదుపరి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, ఏర్పాట్లపై సూచనలను తీసుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్ఓ అమరేందర్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
Dec 04 2024, 15:26