బంగ్లాదేశ్ బరితెగింపు
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. రోజుల తరబడి ఇవి కొనసాగుతోన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి బ్రేకులు పడట్లేదు.
షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి. హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు.
మహ్మద్ యూసుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు. ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా భావిస్తోన్నారు. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాలన్నింటిపై ఇటీవలే ఆర్ఎస్ఎస్ ఘాటుగా స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేయాలని, ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పీల్ చేసింది. సాధారణ పరిస్థితులు, శాంతియుత వాతావరణం నెలకొనేలా ఇస్లామిక్ గ్రూప్స్‌తో చర్చించాలని కోరింది.
అక్కడ జరుగుతోన్న పరిణామాలన్నింటినీ కూడా భారతీయ టెలివిజన్ ఛానళ్లు ఎప్పటికప్పుడు కళ్లకు కట్టినట్టు చూపిస్తోన్నాయి. రాజధాని ఢాకా సహా ఇతర నగరాల్లో హిందువులు, హైందవ ఆలయాలు, గుళ్లు- గోపురాలపై సాగుతున్న దాడులను ప్రపంచం ముందుకు తీసుకొస్తోన్నాయి. బంగ్లాదేశ్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తోన్నాయి.
దీన్ని కొంతమంది బంగ్లాదేశ్ మత ఛాందసవాదులు ఎంతమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలన్నింటిపైనా తక్షణమే నిషేధం విధించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. దీనిపై ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ ఆపరేషన్ చట్టం 2006 కింద భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయాలంటూ అడ్వొకేట్ ఎక్లాస్ ఉద్దీన్ భుయాన్ ఈ పిటీషన్ వేశారు. దీన్ని జస్టిస్ ఫాతిమా నజీబ్ జస్టిస్ సిక్దర్ మహ్మదుర్ రజీతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
బంగ్లాదేశ్ సమాచార, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, ఆ దేశ టెలికమ్యూనికేషన్ల రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్‌ను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. స్టార్ జల్సా, స్టార్ ప్లస్ జీ బంగ్లా రిపబ్లిక్ బంగ్లా సహా భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలపై నిషేధం విధించాలని అభ్యర్థించారు.
Dec 03 2024, 19:07