ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు ‼️
ఖాళీలను సక్రమంగా చూపలేదు.. చూపినవాటిల్లోనూ తప్పులు.. ఇక రాత్రికి రాత్రే మారిన జోన్లు.. ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అని హూంకారం!
ఆందోళనకు దిగితే పోలీసులతో బెదిరింపులు! ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో బదిలీల పరిస్థితి. గురుకుల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా కొనసాగుతున్నది.
ప్రణాళిక అంటూ లేకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా బదిలీలు నిర్వహిస్తున్నారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీ సాధారణ బదిలీల ప్రక్రియను ఇటీవలే ప్రారంభించగా.. మొదటి నుంచి 317 బాధితులకు న్యాయం చేస్తామని, స్పౌజ్, ఇతర మెడికల్ కేసులను పరిష్కరిస్తామని, అంతా కూడా ఆన్‌లైన్ ద్వారానే బదిలీలను చేపడతామని సొసైటీ అధికారులు ప్రకటించారు.
కానీ, ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో తొలుత సీనియర్ల అంగీకారం తీసుకోవాలి.
బలవంతంగా బదిలీ చేయాల్సివస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలి. కానీ సొసైటీ మాత్రం అందుకుపూర్తి విరుద్ధంగా ఏకపక్షంగా రాత్రికిరాత్రే సీనియర్ టీచర్లతో లిస్ట్ విడుదల చేసి, మరుసటి రోజే కౌన్సెలింగ్‌కు రమ్మని పిలవటంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు.
317 జీవో, స్పౌజ్ కేసులను కూడా సొసైటీ పరిగణనలోకి తీసుకోవటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చాక, అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బదిలీల కోసం ముందుగా ప్రకటించిన మెరిట్ జాబితాలో పేర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన మెరిట్ జాబితాలో లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పారదర్శకత పాటించాలని, సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Jul 11 2024, 11:49