తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర అడ్డంకులు తొలగింపు - హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఎవరైనా అనుమతి లేకుండా వెళ్లే వాహనాలను నిలుపుదల చేసేందుకు జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన రెండు టైర్ కిల్లర్లు, నాలుగు హైడ్రాలిక్ బొలార్డ్స్ భూమిలో ఏర్పాటు చేశారు. ఇవి ఆటోమేటిక్ విధానంలో పని చేస్తాయి. వీటిని తొలగించి, జగన్ ఇంటి సమీపంలోని చెకింగ్ పాయింట్లను తీసేశారు.
వైఎస్సార్సీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జగన్ ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావడంతో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రత టెంట్లను సోమవారం రాత్రి తొలగించారు, ఆయన నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో గతంలో అత్యంత ఆధునిక సామగ్రితో భద్రతా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపి వేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్‌తో పని చేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్ పోస్టును సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి.
ఇంతకు ముందే తాడేపల్లి ప్యాలెస్ ముందు అంక్షలు తొలిగాయి. నాలుగు లేన్ల రహదారి మంగళగిరి - తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయించటంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ రహదారిలోకి వెళ్లాలంటే ఉన్నతాధికారులు సైతం తమ ఫొటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అటువైపు అనుమతించే పరిస్థితి ఉండేది.
ఇదే విధంగా జగన్ అక్రమ కట్టడాలు, ఆడంబర బందోబస్తులకు ఎన్డీయే ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెక్ పెడుతోంది. దీంతో ప్రజలకు విముక్తి కలుగుతోంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ జగన్ వెలగబెట్టిన కార్యాలను ప్రభుత్వం చక్కబెడుతూ వస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Jul 02 2024, 12:53