అయోధ్య గర్భగుడిలో నీటి లీకేజి !
- స్పష్టత ఇచ్చిన ఆలయ కమిటీ
అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న (roof leak) వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న (roof leak) వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్ కాలేదని స్పష్టం చేశారు.
విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. ‘ఆలయంలో నీటి లీకేజీ లేదు. అయితే, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల నుంచి వర్షం నీరు ఆలయంలోపలికి వచ్చింది. ఆలయ భవనాన్ని నేనే స్వయంగా పరిశీలించాను. రెండో అంతస్తు నిర్మాణంలో ఉంది. రెండో అంతస్తు పైకప్పు పూర్తైతే వర్షం నీరు ఆలయంలోకి రావడం ఆగిపోతుంది’ అని నృపేంద్ర మిశ్రా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
కాగా, సోమవారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత పైకప్పు ద్వారా ఆలయ గర్భగుడిలోకి వర్షపు నీరు వచ్చిందని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోపించిన విషయం తెలిసిందే. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందన్నారు. ‘దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజినీర్లు రామమందిరాన్ని నిర్మిస్తుండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించారు. కానీ వర్షం పడితే పైకప్పు లీక్ అవుతుందని ఎవరకీ తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఎందుకు జరిగింది..? ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటు’ అని అన్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించి లీకేజీని అరికట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయం నుంచి నీరు బయటకు వెళ్లేలా చూడాలని కోరారు.
1800 కోట్లతో ఆలయ నిర్మాణం !
ఆయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న ఎంతో అర్భాటంగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలా నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజకీయ, సినిమా, పరిశ్రమ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చూసేందుకు లైవ్ ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేతృత్వంలో చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లుగా ఉన్నది. ఆలయ నిర్మాణం, అనంతర నిర్వహణ కోసం ట్రస్టుకు దాతల నుంచి దాదాపు రూ.3,500 కోట్ల మేర వచ్చాయి.
Jun 27 2024, 09:12