అంగన్‌వాడీ టీచర్లను పట్టించుకోని ప్రభుత్వం !
కరీంనగర్ జిల్లా : గర్భిణులు, బాలింతలు, మూడు సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎన్నటికైనా వేతనాలు పెరుగుతాయనే గంపెడాశతో ప్రభుత్వం ఏది చెప్పినా వాటిని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలతోపాటు అద్దె అలవెన్సులను పెంచి ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న భవనాలు సరిగా అద్దె చెల్లించడం లేదు. దీంతో టీచర్లే వారి వేతనాల నుంచిగానీ, అప్పొసప్పో చేసి అద్దెలు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో 777 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో అప్‌గ్రేడ్ చేసిన 25 మినీ అంగన్‌వాడీలతో కలిసి మొత్తం 777 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నాలుగు ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఈ అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గంగాధర ప్రాజెక్టు పరిధిలో 155, హుజురాబాద్ పరిధిలో 226, కరీంనగర్ రూరల్ పరిధిలో 199, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 172 కేంద్రాలు పని చేస్తున్నాయి.
వీటి ద్వారా 4,544 మంది గర్భిణులు, 14,689 మంది బాలింతలు, ఏడేళ్ళలోపు పిల్లలు 5,021, ఒకటి నుంచి మూడేళ్లలోపు బాలబాలికలు 19,449 మంది , మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 19,989 మంది, మొత్తం 63,692 మందికి అంగన్‌వాడీల ద్వారా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 777 మంది అంగన్‌వాడీ టీచర్లు, 777 మంది ఆయాలు పని చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను 18 వేలకు పెంచుతామని ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించడంతో అంగన్‌వాడీలు, అంగన్‌వాడీ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఆరునెలలు గడిచినా వేతనాల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశ చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం ఏమి చెప్పినా చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కోరుతున్నారు
Jun 22 2024, 08:53