గ్రూప్-1 ప్రిలిమ్స్ పక్కడ్బందీ గా నిర్వహించాలి
- వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
జిల్లాలోని ప్రభుత్వ పింగళి మహిళా డిగ్రీ కళాశాలలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల సూపరిండెంట్లు, అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను అధికారులు పక్కడ్బందీ గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు.
జిల్లాలో 17 కేంద్రాల్లో 9168 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, ప్రతి కేంద్రం సీసీ కెమెరా నిఘాలో ఉంటుందన్నారు. డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రూట్ అధికారులు, ఇన్విజిలెటర్లను నియమించామని, ఈ సారి బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
ఈ నెల 9న ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. గతంలో జరిగిన అవకతవకల దృష్ట్యా ఏ ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పరీక్షకు రెండు రోజుల ముందే సెంటర్ల దగ్గర సూచనల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాల్లో అనుమతి లేదని తెలిపారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ చంద్రమౌళి, పరీక్ష కేంద్రాల సూపరిండెంట్లు, అబ్జర్వర్లు పాల్గొన్నారు.
Jun 09 2024, 10:40