నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్..!
- అరగంట ముందు వస్తేనే అనుమతి: టీజీపీఎస్సీ
- హాజరు కానున్న 4.03 లక్షల మంది
- రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు
- అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సుమారు 4.03లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
10 గంటల తర్వాత ఆయా కేంద్రాల ప్రధాన గేట్‌ను మూసి వేస్తారని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలకా్ట్రనిక్ పరికరాలు గానీ, వస్తువులను గానీ అనుమతించబోమని పేర్కొన్నారు.
పరీక్షకు చెప్పులు మాత్రమే ధరించి రావాలని, బూట్లు వేసుకుని రావద్దని, ఉదయం 9.30గంటల నుంచే బయోమెట్రిక్ హాజరు తీసుకుంటామని చెప్పారు. కాగా, బయోమెట్రిక్ హాజరు నమోదు కోసం శిక్షణ పొందిన ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని పరీక్ష కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించేందుకు ప్రతీ 20 పరీక్ష కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్లను, పరీక్ష కేంద్రం వద్ద హాల్ టికెట్లు, గుర్తింపు పత్రాలు పరిశీలనకు ప్రతీ 100 మందికి ఒక అధికారిని నియమించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, 3-5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే అభ్యర్థుల కోసం శనివారం నుంచే ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి బస్సులు నడుతుపుతున్నామని తెలిపారు. జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల సమాచారం అందించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమయానికి కేంద్రానికి చేరుకుని, ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు.
Jun 09 2024, 10:35