పంచాయితీ ఎన్నికలకు సిద్ధమా !
- మొత్తం రిజర్వేషన్లు 50 కు దాటొద్దని సుప్రీం ఆదేశాలు.. ఎస్సీ, ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతమనే ప్రశ్నలు
- పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్.. ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం
- జూన్ చివర్లో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా?.. ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50ు మించితే మరో చిక్కు
- జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న బీసీలు
రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజికవర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండగా.. ఇందులోనే ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది.
మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతోందన్న అభిప్రాయాలున్నాయి. వాస్తవానికి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్తింపజేయాలా? లేక కులగణన చేపట్టి ఆ వివరాలు తేలిన తరువాత ఎన్నికలు నిర్వహించాలా? అని సర్కారు యోచిస్తోంది. కానీ, వచ్చే జూన్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలంటే.. ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్ల శాతం పరిధి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. బీసీలకు కూడా జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్ బలంగా ఉన్నా.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి.
ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికా్‌సరావు గవాళి కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్‌ఎస్ సర్కారు.. బీసీల రిజర్వేషన్‌ను 23 శాతానికి తగ్గించి ఎన్నికలు జరిపింది. ఇది వివాదాస్పదం కావడంతోపాటు హైకోర్టు కూడా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా బీసీల రిజర్వేషన్ అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న జనాభా దామాషా విధానమైతే.. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన మేరకు రిజర్వేషన్ వర్తిస్తుంది. బీసీలవిషయంలో సమస్య తలెత్తుతోంది. ప్రస్తుత నిబంధన ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా ఎస్సీ, ఎస్టీ జనాభాను లెక్కించి దాని ప్రకారం వారికి రిజర్వేషన్ కేటాయిస్తారు.
అయితే ఆయా గ్రామాలు, మండలాల్లో ఎస్సీ, ఎస్టీలు క్కువగా ఉండి, బీసీలు తక్కువగా ఉంటే.. ఆ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు పోను మిగిలిన రిజర్వేషన్‌లో బీసీలకు కేటాయించాల్సి వస్తోంది. దీంతో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ విధానం కోసమైతే ఓటర్ల జాబితాను పరిశీలించి, వివరాలు సేకరిస్తే సరిపోతుంది.
అనంతరం ఆయా కులాల వారీగా రిజర్వేషన్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. కానీ, బీసీల రిజర్వేషన్ మాత్రం తేలడంలేదు. ఇలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన కులగణనను పూర్తిచేసిన తరువాత వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. పైగా కులగణనలో బీసీలు అధికంగా ఉన్నారని తేలితే.. అప్పడు కూడా వారికి కేటాయించే రిజర్వేషన్లలో మళ్లీ ఈ 50 శాతం సమస్యే తలెత్తుతుంది.
Jun 07 2024, 18:49