రేషన్ కార్డు ఎప్పుడిస్తారు సారు ..?
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు లేకపోవడంతో గత ప్రభుత్వ హయాం నుంచి అనేక మంది సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు.
రేషన్ కార్డులు లేకపోవడంతో గత ప్రభుత్వ హయాం నుంచి అనేక మంది సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చింది.
ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. వివిధ కేటగిరీల కింద ఆరు గ్యారంటీలకు 1.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తెల్లరేషన్ కార్డు కోసం ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు విడిగా తెల్ల కాగితాలపైనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారు.
తెల్లరేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఆశలు చిగురింపజేస్తున్నా స్పష్టత మాత్రం రావడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం లక్షా 73 వేల 745 రేషన్ కార్డులు ఉన్నాయి. 4,97,103 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఆహార భద్రత కార్డులు 1,59,854, అంత్యోదయ కార్డులు 13,684, అన్నపూర్ణ కార్డులు 207 ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత రేషన్ కార్డులు ఇస్తారని లబ్ధిదారులు ఆశగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు రాకపోగా కనీసం ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చలేదు.
చేర్పులు, మార్పులు కూడా లేవు. జిల్లాలో చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు 20,606 పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు, కోడళ్ల పేర్లు చేర్చాలంటూ వేలాది మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటితోపాటు గతంలోనే రేషన్ కార్డు కోసం 40 వేల మంది వరకు అర్హులు దరఖాస్తు చేసుకున్నారు.
2018 సంవత్సరానికి ముందు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 2021 ఆగస్టులో 2271 మందికి రేషన్ కార్డులు అందించారు. ఆ తరువాత కనీసం మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా అందించలేకపోయారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు అర్హత ఉన్నా తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో అనేకమంది డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల్ల స్థలాలు అందుకోలేకపోయారు. మరోవైపు వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందే సమయంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు కూడా రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో దాదాపు 40 వేల మంది అర్హులు దూరమయ్యే పరిస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే బోయినపల్లి మండలంలో 12,808 మంది, చందుర్తి 11,737, ఇల్లంతకుంట 16,598, గంభీరావుపేట 15,567, కోనరావుపేట 14,802, ముస్తాబాద్ 16,127, రుద్రంగి 5404, తంగళ్లపల్లి 16,766, వీర్నపల్లి 4741, వేములవాడ 7854, వేములవాడ రూరల్ 8050, ఎల్లారెడ్డిపేట 17,030, సిరిసిల్ల మున్సిపాలిటీలో 30,146, వేములవాడ మున్సిపాలిటీలో 14,987 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Jun 03 2024, 15:39