ప్రధాని మోడీ ఆస్తుల విలువ తెలుసా ?
- సొంత ఇల్లు, కారు లేవు.. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రధాని వెల్లడి
- వారాణసీ నుంచి నామినేషన్
- గంగా సప్తమి పర్వదినాన దాఖలు
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా.. మంగళవారం ఉదయం ఆయన జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశలో (జూన్ 1న) పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో వారాణసీ ఉంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు మంగళవారమే. గంగాదేవి భూమికి దిగివచ్చిన గంగా సప్తమి, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో.. మోదీ ఈరోజును ఎంచుకున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఆయన దశాశ్వమేధ ఘాట్‌లో గంగా స్నానం చేశారు.
అక్కడ జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి గుడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు. ‘‘కాశీతో నా అనుబంధం అద్భుతమైనది, విడదీయలేనిది, పోలిక లేనిది. మాటల్లో చెప్పలేనిది. మీ అందరి ఆప్యాయతతో పదేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా గుర్తురావట్లేదు. ఈరోజు గంగమ్మ తల్లి నన్ను తన దత్తత తీసుకుంది’’ అని ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
ప్రతి బూత్‌లోనూ.. గతంలో పోలైన ఓట్ల కంటే 370 ఓట్లు అధికంగా పోలయ్యేలా చూడాలని సూచించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆయన ఈ సూచన చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ఈ చారిత్రక నియోజకవర్గం (వారాణసీ) నుంచి పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం’’ అని పేర్కొన్నారు.
May 20 2024, 09:04