పార్లమెంట్ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం
- తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు
- ప్రజలకు మావోయిస్టుల కీలక పిలుపు
- పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయవద్దని పిలుపు
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టుల వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో ఈ వాల్‌పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు తుది అంకాని చేరుకున్నాయి. నేడు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. గత 50 రోజులకు పైగా ఊదరగొట్టిన మైకులు మూగబోనున్నాయి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసీ గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తవుతుంది. మెుత్తం 17 పార్లమెంట్ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రాలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ కరపత్రాల్లో ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరగుతున్న పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరహద్దుల్లో ఈ కరపత్రాలు కలకలం రేపాయి. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ సమీపంలో మావోయిస్టుల పేరిట వాల్ పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి.
పార్లమెంట్ ఎన్నికలను ఓటర్లు బహిష్కరించాలని ఈ కరపత్రాల ద్వారా మావోయిస్టులు పిలుపునిచ్చారు. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్లను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు, కేంద్రబలగాలు అలర్ట్ అయ్యాయి. ఏజెన్సీ ఏరియాలో భారీగా భద్రత బలగాలను మోహరించారు. సమీప గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.
May 11 2024, 12:39