జగత్ విజేతగా టీమిండియా
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఎనిమిదో విజయం ఖాతాలో వేసుకుంది.
కష్టతరమైన పిచ్‌పై బ్యాటర్ల మొక్కవోని దీక్షకు.. బౌలర్ల సహకారం తోడవడంతో టీమ్‌ఇండియా అజేయంగా నిలిచింది. ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో రోహిత్ సేన 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తన 35వ పుట్టినరోజు నాడు బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కితే.. శ్రేయస్ అయ్యర్ (77; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి అండగా నిలిచాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుత ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సెన్, రబడ, కేశవ్ మహరాజ్, షంసీ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటైంది. నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. ఒక్కరు కూడా 15 పరుగుల మార్క్ దాటలేకపోయారు.
వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగిస్తున్న డికాక్ (5), బవుమా (11), డసెన్ (13), మార్క్మ్ (9), క్లాసెన్ (1), మిల్లర్ (11), జాన్సెన్ (14) ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొడితే.. మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
రికార్డు సెంచరీ బాదిన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టీమ్‌ఇండియా తమ చివరి లీగ్ మ్యాచ్ వచ్చే ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది...
Nov 06 2023, 10:05