భాజపా, జనసేన మధ్య కుదిరిన పొత్తు
•9 స్థానాల్లో జనసేన పోటీప్రధాని సభలో పాల్గొననున్న పవన్‌కల్యాణ్..
హైదరాబాద్: భాజపా, జనసేన మధ్య పొత్తు కుదిరింది. శాసనసభ ఎన్నికల్లో జనసేన తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది..
ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ నివాసంలో భాజపా రాష్ట్ర నేతలు శనివారం రాత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సమావేశంలో పవన్‌కల్యాణ్‌తోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకరించింది. కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఏయే స్థానాల్లో జనసేన పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఆదివారం వెల్లడించనున్నారు.
119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను భాజపా ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకుగాను తొమ్మిది చోట్ల జనసేన బరిలోకి దిగనుండగా.. 22 స్థానాలకు భాజపా అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్‌కల్యాణ్ హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాలని పవన్‌కల్యాణ్‌ను కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు కోరగా..
అందుకు ఆయన అంగీకరించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌డీయే భాగస్వామిగా ఉన్న జనసేన.. గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకరించిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని.. తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని పేర్కొన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని తెలిపారు..
Nov 05 2023, 13:34