నేడు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నేడు ఆదివారం మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్క్రీనింగ్ మూడు సార్లు భేటీ అయ్యి అభ్యర్థుల పేర్లను ఓ కొలిక్కి తీసుకురాగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసిసి ఆమోదం తర్వాత నేడు అభ్యర్థులకు సంబంధించి ప్రకటన చేయనుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సైతం శనివారం కీలక ప్రకటన చేశారు.
ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.58 మంది పేర్లతో మొదటి జాబితాను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.
మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయని పొత్తులపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ రోజు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి, అధిష్టానం ఎవరికి షాక్ ఇవ్వనుందన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ మొదటి విడత జాబితాలో గతంలో పోటీ చేసిన వారి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి..
Oct 15 2023, 12:20