తెలంగాణ లో ఎన్నికల సమరానికి సన్నద్ధమైన బిఆర్ఎస్
ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్‌ఎస్ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్ ప్రజలకు వెల్లడించనున్నారు.
ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని అంటున్నాయి.
ఎన్నికల సందర్భంగా నేతలంతా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులోని అంశాలపై విస్తృతంగా చర్చ పెట్టనున్నారు.
అభ్యర్థులకు బీ-ఫారాలు
బీఆర్‌ఎస్ అభ్యర్థులందరికీ సీఎం కేసీఆర్ ఆదివారమే బీ-ఫారాలు అందజేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులను తెలంగాణ భవన్‌కు రావాలని పిలిచారు. మొత్తం 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫారాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మ్యానిఫెస్టో విడుదల, బీ-ఫారాల అందజేత కార్యక్రమం ఉండనున్నది. అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు అధ్యక్షతన జరిగే పార్టీ ఎన్నికల సభకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్తారు.
ఈ సభతో మొదలయ్యే కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రతి రోజు 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనున్నాయి.
Oct 15 2023, 12:16