పొన్నాలను బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించిన: మంత్రి కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నేతలు.. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు దాటి పోతున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హస్తానికి గుడ్‌బై చెప్పారు.
రాజీనామా చేసి కొన్ని గంటలైనా గడవక ముందే బీఆర్ఎస్ పెద్దలు సంప్రదింపులు జరిపి.. కారెక్కించడానికి ప్రయత్నాలు షురూ చేసింది. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. మంత్రి ఆహ్వానాన్ని పొన్నాల కూడా స్వాగతించారు.
పొన్నాలతో భేటీ తర్వాత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బలహీన వర్గాల బలమైన గొంతుక పొన్నాలను బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించాను. సానుకూలంగా స్పందించారు.
సీఎం కేసీఆర్ సూచన మేరకే వచ్చాను. రేపు సీఎం కేసీఆర్‌ను పొన్నాల కలుస్తారు. ఈనెల 16న జనగామలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరాలని కోరాను. సీఎంను కలిశాక ఆయనే పూర్తి వివరాలు చెబుతారు. బీఆర్ఎస్‌లో పొన్నాలకు సముచిత గౌరవం ఇస్తాం. పొన్నాలపై పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ బాధాకరం.
బలహీన వర్గాల నేత వయసులో పెద్ద అలాంటి నేతపై రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను ఛీదరించుకుంటున్నారు. పార్టీలు మారిన నేతనే నీతులు చెబుతున్నారు. 40 ఏళ్లు పని చేసిన నేతకు ఇలాంటి అవమానాలు జరిగితే ఆ పార్టీలో ఎలా కొనసాగుతారు.
పొన్నాలను పట్టుకుని సచ్చేముందు అని చిల్లర మాటలు ఎలా మాట్లాడుతారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్‌తో భేటీ తర్వాత పొన్నాల మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. రాజకీయాల్లో పదవులు కో-ఆర్డినేషన్ కోసం మాత్రమే. రేవంత్ లాంటి దౌర్భాగుడి గురించి నేను మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీని రేవంత్ లాంటి వాళ్లు భ్రష్టు పట్టిస్తున్నారు.
రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చాక అయన ఎమ్మెల్యే గా ఎందుకు గెలవలేదు?, పార్టీలో నేనొక్కడ్నే ఓటమి పాలయ్యానా?, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ భార్య ఓడిపోలేదా?, అవమానాన్ని భరించలేకే పార్టీని వీడా. బీఆర్ఎస్‌లో చేరాలని కేటీఆర్ నన్ను కోరారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత అన్ని వివరాలు చెప్తా.అని పొన్నాల పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. జనగామ బీఆర్ఎస్ టికెట్ పొన్నాలకు ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే బీసీ నాయుకుడ్ని కలిసినట్లు పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది. పొన్నాల బీసీ నాయకుడు కావడం.. పైగా రాజకీయ అనుభవం కలిగిన నేత అయి ఉండడం బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశంగా భావిస్తోంది...
Oct 14 2023, 18:52