నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల ?*
- మధ్యాహ్నం 12గంటలకు ముహూర్తం
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ
నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్‌లో పోలింగ్ జరగవచ్చని తెలుస్తోంది. వెలువడుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో, తెలంగాణలో ఎన్నికల టెన్షన్ మొదలైంది.
నేడే ఎన్నికల షెడ్యూల్:
తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరి కొద్ది సేపట్లో విడుదల కానుంది. కొద్ది రోజులుగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందింది. ఈ మేరకు ఈ మధ్నాహ్నం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసారు.
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలోనూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ తొలి వారంలోనే పోలింగ్ ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 10 -15 మధ్యలో ఫలితాలు వెల్లడవుతాయని అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల తరహాలోనే తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.
ఈ మేరకు ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు సమీక్షలు చేసారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణ పైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటంతో పాటుగా ఓటర్ల జాబితాను ఫైనల్ చేసారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటన ద్వారా వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది. ఫలితాల ప్రకటన వరకు పూర్తిగా ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే ఈ అయిదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగాల్సి ఉంటుంది. ఇక, తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దం అయ్యాయి.
జాతీయ స్థాయిలోనూ సమీకరణాలు మారుతున్నాయి. ఇండియా కూటమి ఏర్పాటు తరువాత జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఆ కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇక, బీజేపీ సార్వత్రిక ఎన్నికల ముందు తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో ఇక దేశం మొత్తం ఇదే రకమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ తో సహా ఇండియా కూటమి పార్టీలు అంచనా వేస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ - కాంగ్రెస్ హోరా హోరీ తప్పదనే అభిప్రాయం ఉంది. ఇక, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమనే ధీమాతో ఉంది. తెలంగాణలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కానుండటంతో..ఇక రాజకీయ సమరానికి పార్టీలు సై అంటున్నాయి.
Oct 10 2023, 09:35