Udhayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. విపక్ష కూటమి ఇండియాలో డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అన్ని మతాలు ఒకటే అన్న అంబేడ్కర్ వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె ఉటంకిస్తూ తమ పార్టీ ఏ ఒక్క మతస్తుల మనోభావాలనూ కించపరచదని పేర్కొన్నారు. అన్ని మతాలు సమానమే అనేది తమ వైఖరని స్పష్టం చేశారు. ఎవరో చేసిన ప్రకటన తమకు ఆపాదించబోరని, తమ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనాతో పోల్చిన ఉదయనిధి మారన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే సరిపోదని దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.
ఇక ఉదయనిధి స్టాలిన్ ప్రసంగ వీడియోను హిందీ సబ్‌టైటిల్స్‌తో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ భాగస్వామ్య పక్షం డీఎంకే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కోరుతోందని, డీఎంకే నరమేధం పిలుపుపై కాంగ్రెస్ మౌనం దాల్చిందని మండిపడ్డారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వందల ఏండ్ల నాటి భారత్ సంస్కృతిని మంటగలుపుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
Sep 03 2023, 19:14