Korutla: దీప్తి హత్యకేసులో చందన, ఆమె ప్రియుడే హంతకులు
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈకేసులో ప్రధాన నిందితులు చందన, ఆమె ప్రియుడేనని పోలీసులు తేల్చారు..
శనివారం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ''ఆర్మూరు-బాల్కొండ రోడ్‌లో నిందితులు కారులో వెళ్తున్నారనే సమాచారంతో కోరుట్ల సీఐ ప్రవీణ్ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. దీప్తి చెల్లెలు బంక చందన 2019లో హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ జాయిన్ అయ్యారు. రెండేళ్ల తర్వాత డిటెయిన్ అయ్యారు. అదే కాలేజీలో చదివిన హైదరాబాద్‌కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ చందనకు పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామనుకున్నారు.
గత నెల 19న ఉమర్ కోరుట్ల వచ్చి చందనతో పెళ్లి విషయం మాట్లాడాడు. ఇద్దరం లైఫ్‌లో సెటిల్ కాలేదు.. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలని ఉమర్ చెప్పాడు. ఆ తరువాత ఉమర్‌కు కాల్ చేసి చందన.. ఇంట్లో ఎవరూ లేరూ నేను మాఅక్క మాత్రమే ఉన్నాం.. కోరుట్ల రావాలని చెప్పింది. దీంతో ఉమర్ 28వ తేదీ ఉదయం కోరుట్ల చేరుకున్నాడు. పథకం ప్రకారం చందన.. దీప్తి కోసం వోడ్కా , బ్రీజర్ తెప్పించింది. సోమవారం రాత్రి తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకుంది. దీప్తి నిద్రలోకి జారుకున్న తర్వాత .. ఉమర్‌కు ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చాడు. చందన, ఉమర్ కలిసి ఇంట్లో బీరువాలో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా దీప్తి చూసి కేకలు వేసింది. దీప్తి మెడకు చున్నీ చుట్టి వెనక్కి లాగారు. అయినా అరుస్తుండటంతో ఉమర్, చందన గట్టిగా పట్టుకుని.. దీప్తి ముఖానికి చున్నీ చుట్టి, మూతి, ముక్కుకు ప్లాస్టర్ వేశారు.
10 నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.1.20లక్షల నగదు, 70తులాల బంగారం తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు మూతికి చుట్టిన ప్లాస్టర్ తీసేసి సహజ మరణంగా చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు. నాగ్‌పూర్ వెళ్లి స్థిరపడేందుకు బయల్దేరారు. ఈక్రమంలో ఆర్మూర్ రోడ్డులో శనివారం ఉదయం నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్ షేక్ సుల్తాన్ (అడ్డగుట్ట ప్రగతినగర్, హైదరాబాద్), అతని తల్లి సయ్యద్ అలియా, షేక్ అసియా ఫాతిమా, హఫీజ్‌ను అరెస్టు చేశాం. నిందితుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం'' అని ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు..
Sep 03 2023, 08:32