ఓటుందా తెలుసుకో.. లేదంటే దరఖాస్తు చేసుకో
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే కీలకం. పాలకులను ఎన్నుకునేది ఓటర్లే. ఈ క్రమంలో ఓటుహక్కు.. వజ్రాయుధం మాదిరిగా పనిచేస్తుంది. అందుకే అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం ఆరు నెలల ముందే కసరత్తు ప్రారంభించింది. ఓటుహక్కు ప్రాధాన్యం, ఓటరు నమోదుకు అవకాశాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా శని, ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించనుంది. ఆగస్టు 26, 27 తేదీల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో నమోదైన ఓటర్లతో కూడిన ముసాయిదాను ఇప్పటికే పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచింది.
ఈ నెల 19 వరకు గడువు
రాబోయే శాసనసభ ఎన్నికల్లో కొత్తగా ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ఈనెల 19 వరకు Ëఓటరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు జాబితాలో తప్పుల సవరణ, ఓటు తొలగింపునకు అదే తేదీని తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటరు నమోదుకు మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను శని, ఆదివారం నిర్వహించనుంది.
గ్రామాల్లో విస్తృత ప్రచారం
తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్హులందరూ ఓటరుగా నమోదయ్యేలా గ్రామాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫారమ్-6 ద్వారా నూతన ఓటుహక్కు, ఫారమ్-7 ద్వారా ఓటు తొలగింపు, ఫారమ్-8 ద్వారా తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నారు. బీఎల్‌ఓలకు కలెక్టర్లు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
అక్టోబరు 4న తుది జాబితా
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటరు తుది జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదవటానికి అవకాశం కల్పిస్తోంది. ఓటరు నమోదు, తప్పుల సవరణ, ఓటు తొలగింపునకు సెప్టెంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువులోపు అందిన దరఖాస్తులను సెప్టెంబరు 28 వరకు అధికారులు పరిశీలిస్తారు. మార్పులు, చేర్పుల అనంతరం అక్టోబరు 1న జాబితాను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఎన్నికల సంఘం అనుమతి పొందాక అక్టోబరు 4న ఓటరు తుది జాబితాను వెల్లడిస్తారు.
Sep 02 2023, 13:56