Pawan Kalyan: అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేం: పవన్
అమరావతి: తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. మన మాతృభాషను దూరం చేసేవిధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు..
తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మాట్లాడే భాష, రాసే భాష ఒకటి కావాలని తపించి.. ఆ దిశగా వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని పవన్ కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుజాతి ఎన్నడూ గిడుగు రామ్మూర్తి సేవలను మరువకూడదని పవన్ పేర్కొన్నారు.
తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పవన్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలు.. విద్యాశాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షరదోషాలు ఉంటున్నాయో తెలుస్తోందని చెప్పారు. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేమన్నారు. చిన్నారులు ఓనమాలు నేర్చుకునే దశ నుంచే మన మాతృభాషను దూరం చేసేలా పాలకుల తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన గిడుగు రామ్మూర్తి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలని పవన్ కోరారు..
Aug 29 2023, 17:48