పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో మా అభ్యంతరాలు పట్టించుకోవట్లేదు: తెలంగాణ
హైదరాబాద్: పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి (Central Water Commission) లేఖ రాసింది..
సీడబ్ల్యూసీ ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్.. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా రాష్ట్రంలోని 954 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇతర ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని గతంలో పలుమార్లు పేర్కొన్నట్లు తెలిపారు.
తాము లేవనెత్తిన తొమ్మిది అంశాల్లో ఒక్కదానిపై చర్య తీసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, పీపీఏ నుంచి సమన్వయ లోపం ఉందని లేఖలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీడబ్ల్యూసీ, పీపీఏ సమావేశాల్లో ఇచ్చిన హామీలు కంటితుడుపుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు.
తక్షణమే తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది..
Sep 27 2023, 19:41