పాలమూరుతో సీమాంధ్ర పాలకుల కుట్రలన్నీ పటాపంచలు.. సీఎం కేసీఆర్ విజన్‌తో కృష్ణా జలాలను ఒడిసిపట్టేందుకు మార్గం సుగమం
సమైక్య పాలకుల కుట్రకు పాలమూరులోని జూరాల ప్రాజెక్టు ఆనవాలుగా నిలిచిపోయింది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టును కుట్రపూరితంగానే తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో కట్టగా..
దాని ఆయకట్టుకే నీరందించలేని దుస్థితి. 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' దానిపైనే మరిన్ని లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు చేశారు. తెలంగాణకు నీళ్లు దక్కకూడదని పకడ్బందీగా కుట్ర చేశారు. పాలమూరు భూములకు నీళ్లు ఎత్తిపోసుకొనే అవకాశమే ఉండకుండా నీళ్లన్నీ శ్రీశైలం చేరి.. అక్కడినుంచి రాయలసీమ భూములకు చేరేలా డిజైన్ చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో సీమాంధ్ర పాలకుల కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. సీఎం కేసీఆర్ విజన్‌తో వరద ఉన్నా.. లేకపోయినా నీటిని వాడుకొనే స్థాయికి చేరుకోవడం విశేషం.
జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 17.84 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. ఆ నీటిని సద్వినియోగం చేసుకొనేందు కు 30 టీంఎసీల నిల్వ సామర్థ్యంతో జూరాల వద్ద ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఇక్కడ నిర్మించడం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధిక ప్రాంతాలకు సాగునీటిని గ్రావిటీ ద్వారానే అందించే అవకాశముండేది. కానీ ఉమ్మడి పాలకులు ఆ తర్వాత కుట్రపూరితంగా ప్రాజెక్టు నిర్మాణ స్థలా న్ని జూరాల ఎగువన రావులపల్లికి మార్చి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 11.94 టీఎంసీలకు కుదించారు. అక్కడ నిర్మించడం వల్ల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినా 9 టీఎంసీలకు మించి వినియోగించుకోలేం. ఇదిలా ఉంటే ప్రాజెక్టు నిర్మాణంతో కర్ణాటకలో పలు ప్రాంతాలు ముంపునకు గురవుతుండగా.. ఆ రాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేసేలా, వివాదాల్లో చిక్కుకొనేలా చేశారు. ఆ తర్వాత కర్ణాటక కోరిన మేరకు ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించలేదు. దీంతో ప్రాజెక్టులో పరోక్షంగా ఏనాడూ 9 టీఎంసీలు నిల్వ చేయని పరిస్థితులను నాటి పాలకులు కల్పించారు. ఫలితంగా ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నికరంగా 6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. కృష్ణా ప్రధాన నదిపై ప్రాజెక్టు ఉన్నా, వరద వచ్చినా ఆ నీటిని వినియోగించుకోలేని విషాధ గాథ అది. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన లక్ష ఎకరాలకే నీరందని దుస్థితి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా తొలుత జూరాల నుంచే ప్రతిపాదించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కొరత ఉండకూడదనే కారణంతోపాటు జూరాలపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకూడదనే దూరదృష్టితో దానిని శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారు. ఉమ్మడి పాలకులు గతంలో చేసిన కుట్రలన్నీ ఛేదించారు. అంతేకాదు 145 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రపంచంలోనే అతి భారీ మోటర్లను ప్రాజెక్టులో మొత్తంగా 8+1 ఏర్పాటు చేశారు. తద్వారా నికరంగా రోజుకు 24వేల క్యూసెక్కులను (2 టీఎంసీలను) ఎత్తిపోసుకొనేలా రూపొందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కృష్ణా నీళ్లపై పూర్తి భరోసా కల్పించారు. మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేశారు. నికరంగా ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అన్ని ప్రాజెక్టుల నుంచి రోజుకు 36,835 క్యూసెక్కులను లిఫ్ట్ చేసుకొనే వెసులుబాటు కలిగింది. నాడు అర టీఎంసీని కూడా వినియోగించుకోని పాలమూరు జిల్లా ప్రస్తుతం ఏకంగా రోజుకు 3.6 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకొనే సామర్థ్యాన్ని చేరుకొన్నదంటే అది సీఎం కేసీఆర్ కృషి ఫలితం. తెలంగాణ సర్కారు సాధించిన జలవిజయం.
జూరాల దిగువన శ్రీశైలం ప్రాజెక్టు ఉంది. కృష్ణ ప్రధాన నదితో తుంగభద్ర, ఆ తర్వాత భీమా నదులు రెండు కూడా వచ్చి ఈ ప్రాజెక్టు ఎగువన కలుస్తాయి. వెరసి నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. అదీగాక శ్రీశైలం ప్రాజెక్టు 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కాగా, అందులో దాదాపు 160 టీఎంసీలను వినియోగించుకొనే అవకాశముంది. ఇది ఉమ్మడి పాలకులకు తెలియనిది కాదు. ఏపీ ప్రాంతానికి నీటిని అందించే హంద్రినీవా సుజల స్రవంతి, తెలుగుగంగా ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు తదితర వాటన్నింటినీ శ్రీశైలం ప్రాజెక్టు నీటి ఆధారంగానే నిర్మించారు. కానీ, అందుకు భిన్నంగా తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించే ప్రాజెక్టులన్నింటిని.. అనేక చిక్కుల్లో ఉండి, నీటిని నిల్వ చేయని స్థితిలో ఉన్న జూరాల కేంద్రంగానే ప్రతిపాదించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మినహా రాజీవ్ భీమా లిఫ్ట్ 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ 3.90 టీఎంసీలు, 22 టీఎంసీల వరద జలాల ఆధారంగా రూపొందించిన నెట్టెంపాడును కూడా జూరాల నుంచే ప్రతిపాదించడం గమనార్హం. అందుకు కారణం ఒక్కటే తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకూడదు. ఆ కుట్రలతోనే తెలంగాణ ఏర్పాటు నాటికీ ఆ ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకుండా చేసిన కుట్రలు అక్కడితోనైనా ఆగా యా? అంటే అదీ లేదు. తెలంగాణవాదుల డిమాండ్, ఉద్యమం ఊపందుకొంటున్న నేపథ్యంలో కంటితుడుపుగా పలు ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. అందులోనూ అనేక కుట్రలు సాగించారు. ఆయా ఎత్తిపోతల పథకా ల్లో నీటిని ఎత్తిపోసే పంపుల ఏర్పాటులోనూ ఆంక్షలు విధించారు. నీళ్లు దక్కనీయకుండా ప్రణాళికలు రూపొందించారు. జూరాల ప్రాజె క్టు నీటి నిల్వ సామర్థ్యం 11.84 టీఎంసీలు కాగా, ఆ ప్రాజెక్టుపై ప్రతిపాదించిన నికరజలాలున్న అన్ని ప్రాజెక్టులకు కావాల్సిన నీళ్లు 41.74 టీఎంసీలు. ఇక వరద జలాల ఆధారం గా నిర్మించిన నెట్టెంపాడుకు మరో 22 టీఎంసీలు. ఇక కృష్ణాలో వరద వచ్చేదే గరిష్ఠంగా 30 రోజులని ఉమ్మడి ఏపీ పాలకులే వాదించారు. ఆ కారణంతోనే పోతిరెడ్డిపాడును విస్తరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. వరద వచ్చిన ఆ సమయాల్లోనే ఆయా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కావాల్సిన నీటిని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంతే. జూరాలలో ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేయలేం. తప్పక కిందికి వదలాల్సిందే. మరి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో నీటిని ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టులను రూపొందించారా? అంటే అదీలేదు. స్వల్ప రేటింగ్ ఉన్న పంపులను ప్రతిపాదించారు. వాటినైనా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించకుండా రెండు లేదంటే మూడు.. ఇలా సరిపెట్టారు. సాధారణంగా ఎత్తిపోతల పథకాల్లో ఎప్పుడూ ఒక స్టాండ్‌బై పంపును అమర్చుతా రు. అనివార్య కారణాలతో ఎప్పుడైనా పంపు మరమ్మతుకు గురైతే మరో పంపుతో నీటిని లిఫ్ట్ చేసేందుకు ఇలా చేస్తారు. కానీ ఉమ్మడి పాలకులు కోయిల్‌సాగర్‌లో తొలుత స్టాండ్ బై పం పు ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చి తర్వాత రద్దు చేశారు. కేవలం రెండు పంపులనే ఏర్పాటు చేసి, పాలమూరుకు నీళ్లు దక్కకూడదనే తమ కుట్రలను అమలు చేశారు.
Sep 13 2023, 19:15