G20: 200 గంటలు.. 300 సమావేశాలు.. 15 ముసాయిదాలు.. దిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు
దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన దిల్లీ డిక్లరేషన్ (G20 Declaration)పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు షెర్పా అమితాబ్ కాంత్ ఆదివారం తెలిపారు..
దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్, కె.నాగరాజు నాయుడుతో కూడిన దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు. వివాదాస్పద ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్లు వివరించారు. వీరందరి కృషి వల్లే జీ20 సదస్సు (G20 Summit) తొలిరోజే నేతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు..
"మొత్తం G20 సదస్సు (G20 Summit)లో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై (రష్యా-ఉక్రెయిన్) ఏకాభిప్రాయం తీసుకురావడం. ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. నాగరాజు నాయుడు, గంభీర్ ఈ విషయంలో తనకు ఎంతో సహకరించారు'' అని అమితాబ్ కాంత్ చెప్పారు..
Sep 10 2023, 13:44