వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్
హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది..
సోమవారం కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ కూడా అదే జైలులో ఉన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అంతకుముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కింది కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువైపుల వాదనలు విన్నాక నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది..
Sep 05 2023, 18:52