వరద బాధిత ప్రజలను ఆదుకోండి అధికారులకు: ఎమ్మెల్సీ కవిత సూచన
నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత జిల్లా అధికారులకు సూచించారు.
శనివారం ఆమె జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయ, సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని కోరారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు, సహాయక చర్యలు వంటి అంశాలపై పలు సూచనలు ఇచ్చారు.
వైద్యం ఆహారం విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ తోపాటు తన కార్యాలయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. సహాయక చర్యలకు సంబంధించి అధికారులు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను సీఎం కేసీఆర్ కు తెలియజేస్తానని, అత్యవసరంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కవిత అన్నారు.......
Jul 29 2023, 16:29